హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కేంద్రమాజీమంత్రి సినీహీరో మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. జగన్ ఆరోగ్య వివరాలపై చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో విఐపీ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ ను రెస్టారెంట్ వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. 

దాడి జరిగిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో ప్రథమ చికిత్స తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్సపొంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దాడి జరిగిన విషయంపై చిరంజీవి జగన్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి కూడా వైఎస్‌ జగన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే వైఎస్‌ జగన్‌కు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.