ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఓ ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కాగా.. వాటిని తిరిగి ప్రారంభించుకోవడానికి ఏపీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

ఈ నేపథ్యంలో.. చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్‌ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరఫున వారికి ఫోన్‌ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాను’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘‘లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని జగన్‌గారు చెప్పారు.అన్ని విభాగాల  ప్రతినిధులతో త్వరలోనే ఆయన్ను కలుస్తాం’’ అని కూడా ట్వీటర్‌లో పేర్కొన్నారు చిరంజీవి. 

లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు ఆగిన నేపథ్యంలో ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. జూన్‌లో షూటింగ్స్‌ కూడా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇక థియేటర్ల రీ ఓపెన్‌ కి మాత్రం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే.. థియేటర్స్ తెరిస్తే.. కరోనా కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.