పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని మంత్రి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఒక మీడియా సంస్థ అధినేత అవసరమైతే ఆత్మబలిదానం చేసుకుంటారంటూ పేర్నినాని మండిపడ్డారు.

జగన్‌పై విషం చిమ్మేందుకు సదరు మీడియా సంస్ధ ఎందుకు ప్రయత్నిస్తోందని నాని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తొందని నాడు సాక్షి పత్రికకు సంబంధించిన ముఖ్యులను అరెస్ట్ చేయాలంటూ జీవోలు ఇచ్చారని నాని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగా చులకన చేయాలని కొన్ని మీడియా సంస్థలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

పరిపాలనలో ఎలాంటి తప్పులు చేయొద్దని.. చంద్రబాబు సహా అనేక మంది ప్రభుత్వంపై ఒక కన్నేసి ఉంచారని జాగ్రత్తగా ఉండాలంటూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని నాని వెల్లడించారు.

చంద్రబాబు, ఆయన కుమారుడికైనా తమ ప్రభుత్వం పట్ల వేచి చూసే ఓపిక ఉందని సదరు మీడియా సంస్ధ అధినేతకు లేదంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు.

ప్రభుత్వాన్ని కింఛపరిచే విధంగా నిరాధారమైన వార్తలు రాస్తే.. సదరు శాఖకు చెందిన ఉన్నతాధికారి వివరణ ఇవ్వాలని.. సదరు వార్త రాసిన చోటే ప్రభుత్వాధికారి ఇచ్చే వివరణను అచ్చు వేయాలని లేదంటే కోర్టుపై దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని తాను సీఎంను కోరానని పేర్ని నాని వెల్లడించారు.

ఆనాడు సాక్షి విలేకరులను అరెస్ట్ చేసి జైలలో పెట్టించారని నాని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులకు వైసీపీ ప్రభుత్వం మంచి హోదాలను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పరిపాలనలో బదిలీలు అత్యంత సాధారణమైన విషయమని... మీడియాపై తాము ఆంక్షలు వేశామన్న వార్తలు నిరాధారమైనవన్నారు.

ఏ పథకం ప్రవేశపెట్టినా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని.. అధికారుల బదిలీలతో పాటు గ్రామ సచివాలయం పరీక్ష పేపర్ లీకైందని అసత్య ప్రచారం చేశారని నాని ఎద్దేవా చేశారు.  

తెలుగు దేశం కు అభిమాన పత్రికలు రివర్స్ టెండరింగ్ పై ఎన్ని హాస్య కథనాలు వండి వార్చినా పోలవరం లో 750 కోట్ల ప్రజా ధనం వృధా కాకుండా కాపాడామని మంత్రి స్పష్టం చేశారు.

గురువారం మధ్యాహ్నం కూడా ఏపీపీఎస్సీ నియామకాలపై సమీక్షా సమావేశం చేసి జనవరి 2020 నుండి ఇంటర్వ్యూ లు లేకుండా నియామకాలు చేపడతామని చెప్పడం పారదర్శకతకు చిహ్నమని పేర్నినాని తెలిపారు.

ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు ఏ విధంగా జరపాలి అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఆ ప్రక్రియ కూడా ఇంకా మొదలు పెట్టక ముందే ఈ రోజు పేపర్ లో అవాస్తవాలు ప్రచురించారని నాని మండిపడ్డారు.