మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు తెలుగుదేశం పార్టీకి వీడ్కోలు చెబుతారని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 1న పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.

పార్టీలో చేరికపై రావెల ఇప్పటికే పవన్‌తో రెండు సార్లు సమావేశమయ్యారు. మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి రావెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసంతృప్తితో ఉన్నారు.. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.

మరోవైపు రావెల టీడీపీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో హైకమాండ్ అలెర్ట్ అయ్యంది. ఆయనను బుజ్జగించడానికి పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. మరి టీడీపీ బుజ్జగింపులకు ఆయన మెత్తబడతారా లేక జనసేనలోకి వెళతారా అన్నది త్వరలోనే తెలుస్తోంది.

రైల్వే శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న రావెల కిశోర్ బాబు... ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రత్తిపాడు నుంచి గెలిచారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవినిచ్చారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల రావెలను సీఎం కేబినెట్ నుంచి తప్పించారు.