ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన భర్తకు ప్రమాదం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. అక్కడున్న భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  యనమలకుదురుకు చెందిన వెలగపూడి సీత అనే మహిళ సోమవారం సీఎం నివాసం వద్దకు చేరుకుంది. తన భర్త అధికార టీడీపీలో క్రియాశీల నాయకుడిగా ఉండేవాడని పేర్కొంది. కొన్ని రోజుల క్రితం తన భర్తకు ప్రమాదం జరుగగా.. చికిత్స చేయించేందుకు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని తెలిపింది. 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇచ్చిన సహాయం ఏమాత్రం సరిపోలేదని.. అందుకే తన భర్తను కాపాడుకునేందుకు సహాయం చేయాల్సిందిగా ఐదు నెలలుగా సీఎం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపింది.