ఆమెకు పెళ్లై.. సరిగ్గా సంవత్సరమే అవుతోంది. అంతలోనే.. ఆమె మృతి చెందింది. అత్తారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కందుకూరు పంచాయతీ గొల్లపల్లెకు చెందిన వసంతకు బండమీదపల్లెకు చెందిన తంబళ్ల వెంకటేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. ఇదిలా ఉండగా వసంత గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందినట్టు పుట్టింటి వారికి అత్తింటి వారు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బండమీదపల్లెకు వచ్చి లబోదిబోమన్నారు. 

తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఎస్‌ఐ సుబ్బారెడ్డి, ములకలచెరువు సీఐ సురేష్‌కుమార్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. తమ కుమార్తెను అత్తింటి వారు చిత్రహింసలు పెట్టారంటూ వసంత  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.