కడప జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. అయితే ఆ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు అంతకుముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. అది కాక ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుందని.. కానిస్టేబుల్ తో సంబంధం ఉందన్న అనుమానంతో..
కడప : వైయస్సార్ కడప జిల్లాలోని వేంపల్లె పట్టణం భరత్ నగర్ వీధికి చెందిన షేక్ ఫర్హాన (28) అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. మృతురాలి తల్లి షహారున్నీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఫర్హానా 11 ఏళ్ల క్రితం పట్టణ పరిధిలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికీ లతీఫ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత జావీద్ ఉరఫ్ మహమ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిద్దరికీ జహీన్ షే అనే కుమారుడు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్త జావీద్ జీవనోపాధి కోసం కువైట్ కి వెళ్ళాడు. భర్త పట్టించుకోకపోవడంతో షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషతో ఏర్పడిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. అతనితో కొద్ది కాలంగా సహజీవనం చేస్తుంది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయమై ఇడ్లీ భాష తో గొడవ జరిగింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఫర్హానాకు కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఇడ్లీ భాష బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి వాదనకు దిగాడు. గురువారం తెల్లవారుజామున ఇడ్లీ భాష ఫర్హానా గొంతు కోసి.. అతి కిరాతకంగా చంపినట్లు ఫర్హానా తల్లి షేక్ షహారున్నీసా పోలీసులకు వివరించింది. ఆ తర్వాత ఫర్హనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రి తరలించారు. ఘటనా స్థలాన్ని పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు, వేంపల్లి సిఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిరుపాల్ నాయక్ పరిశీలించారు. షేక్ బాషా ఉరఫ్ ఇడ్లీ భాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భర్త మరో పెళ్లి చేసుకున్నాడని.. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ
కాగా, కులాంతర వివాహం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతులకు చిట్ర మురళి (27) ఒక్కగానొక్క సంతానం. ఇతను పీజీ పూర్తి చేసి, పెనుగొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అదే గ్రామానికి చెందిన వీణ డిగ్రీ పూర్తి చేసింది. మూడేళ్ల కిందట గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం పొంది, ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది. మురళి, వీణ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిరుడు జూన్ లో వివాహం చేసుకున్నారు.
ఈ క్రమంలో... మురళి కియా పరిశ్రమకు వెళ్లడానికి గురువారం సాయంత్రం రాప్తాడు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సుకోసం వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని బలవంతంగా తీసుకు వెళ్లారు. విధుల నుంచి ఇంటికి వచ్చిన వీణ భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ స్విచాఫ్ రావడంతో మిత్రులు, కుటుంబ సభ్యులను ఆరా తీసింది. ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, శుక్రవారం రాప్తాడు మండలం లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించారు. కిడ్నాప్ కు గురైన మురళి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. తమ ప్రేమ వివాహం ఇష్టం లేకనే తన తల్లి భర్తను హత్య చేయించి ఉంటుందని వీణ రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవ రెడ్డి తెలిపారు.
