అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని చెప్పారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఐడీ విచారణలో బాధితులు అసలు నిజాలు వెల్లడించారని  స్పష్టం చేశారు.

భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చిందని ఆర్కే అన్నారు. ఫిర్యాదు దారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారని ఆర్కే ఆరోపించారు.

ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి మరీ తాను సీఐడీకి ఆధారాలు ఇచ్చానని ఆయన చెప్పారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు జీవోలు ఇప్పించారని ఆర్కే ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి రోజుకో నేతతో మాట్లాడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

అంతకుముందు మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. అమరావతిలో భూముల క్రయ విక్రయాలపై ఆర్కే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టే స్థాయికి సీఎం జగన్ దిగజారారంటూ నరేంద్ర దుయ్యబట్టారు. రాజధాని తరలించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన మీడియాకు వీడియోలు చూపించారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు, పోలీసులే ఇందులో పాత్రధారులు, సూత్రధారులని ధూళిపాళ్ల ఆరోపించారు.   

చంద్రబాబుపై ఆర్కే పెట్టిన సీఐడీ కేసులో అభూత కల్పనలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సీలు, బాధితులు ఎవరూ లేరని నరేంద్ర స్పష్టం చేశారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, అద్దెపల్లె సాంబ శివరావుకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారని ధూళిపాళ్ల చెప్పారు. అంతేకాకుండా బాధితులు మాట్లాడిన వీడియోలను ధూళిపాళ్ల  మీడియా ముందు ప్రదర్శించారు.