ఒంగోలు: ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్న వ్యక్తి గుట్టు రట్టయింది. తెలంగాణలో ఒకరిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. బేల్దారి పని కోసం తెలంగాణ వెళ్లి అక్కడ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో నాలుగేళ్లు కాపురం చేశాడు.

చెప్పాపెట్టకుండా అతను ఆంధ్రకు వచ్చి మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో తెలంగాణకు చెందిన మహిళ వెలిగండ్ల పోలీసు స్టేషన్ లో అతనిపై బుధవారం ఫిర్యాదు చేసింది. ఎఎస్ఐ ముస్తాఫా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్రం బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వనజకు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికే చెందిన తుమ్మల మహేష్ తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అనారోగ్యంతో మహేష్ మృత్యువాత పడ్డాడు. 

వెలిగండ్ల మండలం గండ్లోపల్లికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షిన్ బేల్దారి పనిచేసేందుకు వర్ధపల్లి వెళ్లాడు. అక్కడ వనజతో పరిచయం ఏర్పడింది. వనజను వివాహం చేసుకుని నాలుగేళ్లు కాపురం చేశాడు. ఆమెకు చెప్పకుండా ఏపీలో గండ్లోపల్లికి వచ్చి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 

విషయం తెలిసి వనజ నిరీక్షన్ కు ఫోన్ చేసింది. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, నీతో నాకు ఏ విధమైన సంబంధం లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడని వనజ చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.