కేంద్రప్రభుత్వానికి విపరీతంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న జీఎస్టీ సామాన్యులపై పెనుభారం మోపుతోంది. అలాగే చిన్నా చితకా వ్యాపారుల జీఎస్టీ అమలు చేయని పక్షంలో భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.

తాజాగా జీఎస్టీ కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారుల వేధింపులు భరించలేక విజయవాడలో సాధిక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని జవహర్ ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్ చేస్తోన్న సాదిక్‌కు జీఎస్టీ అధికారులు రూ.50 లక్షల జరిమానా విధించారు.

అయితే జరిమానా విషయంలో అధికారుల నుంచి రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువ కావడంతో సాదిక్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున స్థానిక బందర్ కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.