తాంత్రిక పూజల పేరిట నగ్నంగా పూజలు చేయాలంటూ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కిలాడీ మాంత్రికుడు. అతడి బారినుండి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

తిరుపతి : మంత్రతంత్రాలతో అనారోగ్య సమస్యలు నయం చేస్తానని నమ్మించి మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ మాంత్రికుడు. మాయమాటలతో మహిళను నమ్మించి అర్దరాత్రి ఇంటికి వెళ్లిన మాంత్రికుడు నగ్నంగా పూజలో పాల్గొనాలని ఒంటరిగా వున్న ఆమెను బలవంతపెట్టాడు. దీంతో అతడి ఉద్దేశం అర్థమైన మహిళ తప్పించుకోడానికి ప్రయత్నించగా కత్తితో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా అతడి నుండి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయితీ పరిధిలోని తారకరామానగర్ లో 35 ఏళ్ల మహిళ నివాసముంటోంది. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఎవరైనా చేతబడి చేసివుంటారన్న అనుమానం ఆమెకు కలిగింది. ఇదే అనుమానాన్ని కొందరు తెలిసినవారి వద్ద ప్రస్తావించగా మాంత్రికుడు మాసారపు సుబ్బయ్యను సంప్రదించాల్సిందిగా సూచించారు. 

శ్రీకాకుళం పట్టణంలోని బహదూర్ పేటకు చెందిన ఆటోడ్రైవర్ సుబ్బయ్య మాంత్రికుడి అవతారం ఎత్తాడు. తనకు మానవాతీత శక్తులు వున్నాయని... వాటితో ఎలాంటి సమస్యలనైనా దూరంచేస్తానని ప్రజలను నమ్మించాడు. దీంతో అతడివద్దకు అనారోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలతో చాలామంది వచ్చేవారు. ఇలా చేతబడి అనుమానంతో మహిళ కూడా మాంత్రికుడిని ఆశ్రయించింది. 

Read More అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు... గుంటూరులో తాంత్రికుడి చేష్టలు వెలుగులోకి...

మహిళ భయాన్ని ఆసరాగా చేసుకుని నిజంగానే చేతబడి జరిగిందని... రూ.20 వేలు ఇస్తే క్షుద్రపూజలు చేసి దీని నుండి విముక్తి కల్పిస్తానని సుబ్బయ్య తెలిపాడు.నిజంగానే అతడు పూజలు చేసి అనారోగ్య సమస్యను దూరం చేస్తాడని సదరు మహిళ భావించింది. కానీ పూజ పేరిట ఈ నెల 14న రాత్రి మహిళ ఇంటికి చేరుకున్న సుబ్బయ్య వక్రబుద్దిని ప్రదర్శించాడు. ఒంటరిగా వున్న మహిళను నగ్నంగా పూజలో కూర్చోవాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా అత్యాచారం చేయబోయాడు. కత్తితో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడగా అతడి బారినుండి తప్పించుకుని గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చింది. 

మహిళ కేకలతో చుట్టుపక్కల ఇళ్లవారు గుమిగూడగా అప్పటికే మాంత్రికుడు సుబ్బయ్య పరారయ్యాడు. వెంటనే బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాంత్రికుడు సుబ్బయ్యపై ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీస్ బృందాలు అతడి కోసం గాలింపు చేపట్టగా రేణిగుంట చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.