ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దానిలో అందరినీ ఆకట్టుకున్నది‘ అమ్మ ఒడి’. ఎందరో పేద తల్లులకు ఇది ఉపయోగకరంగా ఉంది. కాగా.. ఇదే పథకం ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఆ అమ్మ ఒడి సొమ్ము కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన అనంతగిరి లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుమ్మకోట పంచాయితీ బురదగడ్డె గ్రామానికి చెందిన తామల దేముడమ్మ(36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మ ఒడి సొమ్ము ఇటీవల దేముడమ్మ బ్యాంకు ఖాతాలో పడింది. మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమెపై డబ్బులు విత్ డ్రా చేయాలంటూ భర్త బలవంతం చేశఆడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో.. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే భార్యను బండ రాయితో తలపై మోది హత్య చేశాడు. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తొలుత నిందితుడు తనకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.