మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు.. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని గంగానమ్మ పేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన శశీదేవి(65) భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. దీంతో.. ఆమె తన కుమారుడు లక్ష్మీ నారాయణ కుటుంబంతో కలిసి జీవిస్తోంది.

అతినికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ  మధ్య కొడుకు లక్ష్మీ నారాయణ మద్యానికి బానిసయ్యాడు. దీంతో.. శశీదేవి చిన్న చిన్న పనులు చేస్తూ.. కొడుకు కుటుంబాన్ని పోషిస్తోంది. కొడుకు తెచ్చే అరకొర సంపాదనకు ఆమె కూడా సహాయపడుతూ వస్తోంది. అయితే.. లక్ష్మీ నారాయణ మద్యానికి విపరీతంగా బానిసగా మారి పనులకు వెళ్లడం కూడా మానేశాడు. మాములుగా అయితే.. అతను పసనసకాయలు విక్రయిస్తూ ఉంటాడు.

శుక్రవారం పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న అతను.. మద్యం తాగడానికి డబ్బులు కావాలంటూ తల్లిని అడిగాడు. దానికి ఆమె తన వద్ద లేవని సమాధానం చెప్పింది.  వెంటనే కోపంతో ఊగిపోయిన అతను పనసకాయలు కోసే కత్తితో తల్లి మెడపై ఒక వేటు వేశాడు. దీంతో తీవ్రగాయమై ఆమె పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. 

కాగా... కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.