తాను మనసారా నచ్చి పెళ్లిచేసుకున్న భార్య పుట్టింట్లోనే ఉండిపోయింది. కాగా.. తన భార్యను కాపురానికి తన వద్దకు పంపడంలేదనే కోపంతో... అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం ఛౌటభీమారం గ్రామానికి చెందిన మేకలబోయిన చిన్నయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె దొరసానమ్మను దూబగుంట వాసి సూలా తిరిపాల్‌తో 25 ఏళ్ల క్రితం వివాహం చేశారు. తిరిపాల్‌ మద్యానికి బానిసై భార్యను వేధించడంతో ఏడేళ్ల క్రితం తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.

అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం అత్తింటికి వెళ్లి భార్యను పంపించాలని గొడవకు దిగాడు. ససేమిరా అనడంతో కత్తితో అత్త చేయిపై, మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు కత్తితో పరారయ్యాడు. 

నెత్తుటి మడుగులో ఉన్న తల్లిని చూసి కుమార్తె, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆత్మకూరు సీఐ పాపారావు, ఏఎస్‌పేట ఎస్సై గోపాల్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.