భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కృష్ణగిరి జిల్లా శూలగిరి తాలూకా బీజీ దుర్గం గ్రామానికి చెందిన ఈశ్వరన్ అనే వ్యక్తికి సూడమ్మ, విజయ అనే ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సూడమ్మకు కోదిల, సరళ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.

ఇక ఈశ్వరన్ తన గ్రామానికే చెందిన సత్యమూర్తికి రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో సత్యమూర్తి... డబ్బు ఇచ్చే విషయంగా అప్పుడప్పుడు ఈశ్వరన్ ఇంటికి వచ్చేవాడు. దీంతో అతని కుమార్తె సరళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం దీనికి తోడు ఈశ్వరన్ సైతం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటి ఖర్చులకు కూడా డబ్బులివ్వకుండా ఉండేవాడు. దీంతో అతని రెండో భార్య విజయ భర్తపై తీవ్ర అసంతృప్తితో ఉండేది. దీంతో అతను పెట్టే బాధలు భరించలేక ఈమె కూడా సత్యమూర్తితో సంబంధం పెట్టుకుంది.

ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసేందుకు ప్రణాళిక రచించింది. కుట్రలో భాగంగా గత నెల 20వ తేదీన ఈశ్వరన్‌ను సత్యమూర్తి శూలగిరి మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చాడు. అనంతరం మద్యంలో విషం కలిపి అతని చేత తాగించాడు. ఈశ్వరన్ స్పృహ కోల్పోయిన తర్వాత తలపై మోది హత్య చేశాడు.

ఇందుకు విజయ కూడా సహకరించింది. అతను చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత ఈశ్వరన్ మృతదేహాన్ని టార్పాలిన్ పట్టాలో చుట్టి బొలెరో వాహనం ద్వారా గుడుపల్లె మండలం ఔన్ కొత్తూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు.

మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన గుడుపల్లె పోలీసులు తల్లిఅగ్రహారం క్రాస్ వద్ద సత్యమూర్తి, విజయలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి, అనంతరం ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.