తన ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  మింది సమీప గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్‌, గుర్రాల జోగారావు స్నేహితులు. వీరిద్దరూ నిత్యం మద్యం సేవించి తిరుగుతూ వారం పదిరోజులకోసారి ఇంటికి వెళ్తుంటారు. 

ఈ క్రమంలో మల్కాపురం ప్రాంతానికి చెందిన దీనా అలియాస్‌ స్వాతితో సన్నిహితంగా ఉంటున్న జోగారావు ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో గణేష్‌ పలుమార్లు స్వాతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎన్నిసార్లు చెప్పినా గణేష్‌లో మార్పు రాకపోవడంతో అడ్డు తొలగించుకోవాలని జోగారావు, స్వాతి నిర్ణయించారు.  

దీనిలో భాగంగా జూలై 5న గాజువాక దరి గ్లోబెక్స్‌ షాపింగ్‌ మాల్‌ వెనుక్కు తీసుకొచ్చారు. అక్కడ మూతపడిన చేపల కంపెనీలో గణేష్‌కు మాయమాటలు చెప్పి కళ్లు, మద్యం తాగించారు. మత్తులోకి జారుకున్నాక గణేస్‌ తలపై జోగారావు కర్రతో దాడి చేయగా.., కింద పడిపోయాక మెడకు బెల్ట్‌తో బిగించి అంతమొందించారు. ఈ క్రమంలో గణేష్‌ కాళ్లు పట్టుకుని స్వాతి సహకరించింది. 

అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. మరో రెండు రోజుల తర్వాత సంఘటనా స్థలానికి వచ్చి చూడగా... మృతదేహం పాడవకపోవడంతో పెట్రోల్‌ పోసి కాల్చి వెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో మృదేహానికి ఉన్న కడియం, వాచీ కాలకపోవడంతో కేసులో అవే కీలకంగా మారాయి. 

తొలుత గుర్తుతెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో అన్ని నిజాలు తెలుసుకోగలిగారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.