ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వరసకు అన్నయ్య అయ్యే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో చోటుచేసుకుంది.

చిలకలూరిపేట రూరల్‌ సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం గురిజేపల్లికి చెందిన అంజనీరాజు మండలంలోని యడవల్లిలోని క్వారీలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్యతో కలిసి చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో నివాసం ఉంటూ ప్రతిరోజూ క్వారీలో విధులకు హాజరవుతుంటాడు.
 
ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి సమయంలో విధులు ముగించుకున్న తర్వాత ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేటకు వస్తుండగా యడవల్లి శివారున దుండగులు అంజనీరాజుపై మారణాయుధాలు, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ ఉదయ్‌బాబులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

అంజనీరాజు గతంలో తనకు అన్నయ్య వరుసయ్యే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం నెరపాడు. ఈ విషయంలో గతంలో బంధువుల మధ్య గొడవలు కూడా జరిగాయి. పెద్దలు సర్దిచెప్పినా వినకుండా ఈ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో హత్య చేసి ఉంటారని అంజనీరాజు సోదరుడు నూతలపాటి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.