ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరిచయస్తుల ఇంట్లో ఉండి చదువుకుంటున్న అక్కాచెల్లెళ్ల పట్ల ఆ ఇంటి యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ వేధించాడు. దీంతో ఆ యువతులు చదువు మానేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెడితే.. కాకినాడ గ్రామీణంలో ఓ గ్రామానికి చెందిన 28,24 యేళ్ల ఇద్దరు అక్కాచెలెళ్లు కాకినాడ అశోక్ నగర్ లో ఉంటున్న, తమకు పరిచయస్తుడైన మడికి రాజేశ్వరదయాల్, ఆయన రెండో భార్య స్వాతిల వద్ద గత పదేళ్లుగా ఉంటూ చదువుకుంటున్నారు. 

కొంతకాలంగా రాజేశ్వర దయాల్ ఇద్దరు యువతులను లైంగికంగా వేదిస్తూ.. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతడి చర్యలను రెండో భార్య కూడా సమర్థిస్తుంది. 

మొదట్లో మంచితనంగా ఉన్న ఇంటి యజమాని ఆ తరువాత తన వికృతరూపం చూపిస్తుండడంతో.. వేధింపులు భరించలేక ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సొంత గ్రామానికి వచ్చేశారు. వీరిద్దరిలో ఒకరు పోలీసులను ఆశ్రయించి, దీనిమీద ఫిర్యాదు చేసింది. దీంతో తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది.