సినిమాల ప్రభావం మనుషులపై గట్టిగా ఉంటుందనడానికి ఎన్నో ఉదాహరణలు. ఎందుకంటే అభిమానులు హీరోల స్థానంలో తమను తాము ఊహించుకుంటారు. కథానాయకుల్లా షర్ట్‌లు, ఫ్యాషన్, హెయిర్ స్టైల్ ఫాలో అవుతారు. భాషా, పెదరాయుడు లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఊళ్లలో ప్రతిఒక్కడు తమను తాము రజనీకాంత్‌లా ఊహించుకున్నారు.

తాజాగా అదే స్టైల్ ఫాలో అయి అరెస్ట్ అయ్యాడో యువకుడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన వద్దకు వచ్చి బాధలు చెప్పుకున్న వారి కష్టాలు తీరుస్తాడు.

ఆ సినిమాని చూసి ఇన్‌‌స్పైర్ అయిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి... ఎవరికైనా సమస్య ఉంటే జనతా గ్యారేజ్‌లో సెటిల్ చేస్తానని మెసేజ్‌లు పంపేవాడు.. అలా ఎవరు పడితే వారి మీదకు వెళ్లిపోవడం.. వాళ్లను చావబాదడం చేసేవాడు.

గత కొంతకాలంగా ప్రదీప్ అరాచకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇవాళ ఉండవల్లి సెంటర్‌లో నడిరోడ్డుపై కత్తి తీసుకుని హల్‌చల్ చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి కూతవేటు దూరంలో యువకుడు కత్తితో సంచరించడంతో పోలీసులు పరుగులు పెట్టారు.