అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశంలోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకన్నాయి. కొన్నిచోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు.. ఆందోళనలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను రద్దుచేశారు.
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశంలోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకన్నాయి. కొన్నిచోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు.. ఆందోళనలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేశారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సరైన సమయంలో వైద్యం అందక మృతిచెందారు. వివరాలు.. ఒడిశాలోని కలహండి జిల్లా నహుపాడకు చెందిన జోగేష్ బెహరా అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా గుండె సమస్యలతో బాధపడుతున్నాడు.
దీంతో చికిత్స కోసం జోగేష్ బెహరా కుటుంబ సభ్యులు అతడిని విశాఖపట్నం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఒడిశా నుంచి విశాఖకు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలోనే నిలిపివేశారు. అదే సమయంలో జోగేష్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించాలని చూశారు. అత్యవసరంగా విశాఖకు తరలించేందుకు స్థానికంగా ప్రైవేటు అంబులెన్సులు అందుబాటులో లేకపోవటంతో బాధితుడి కుటుంబ సభ్యులు కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. దీంతో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని నిఘా వర్గాల సమాచారం. శుక్రవారం నాడు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వేల మంది నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు నిరసనలకు దిగారు. పోలీసులు కాల్పులు జరపడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. నిన్న తెలంగాణలో జరిగిన అగ్నిపథ్ ఆందోళనలు.. నేడు ఏపీని తాకాయి. ఏపీలోని రైల్వే స్టేషన్లలో ఆందోళనలు జరిగే అకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. దీందో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ, కర్నూలు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా నిరసనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను మూసివేసి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్మీ ఆశావహులు భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలను అనుసరించి, అధికారులు స్టేషన్‌ను మూసివేశారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
