ఓ నవవధువు కాళ్ల పారాణి ఆరకుండానే భర్తను కోల్పోయింది. ఓ చిన్నారి ఇంకా కళ్లు కూడా తెరవకుండానే తండ్రిని కోల్పయింది. రోడ్డు ప్రమాదం ఇద్దరినీ అనాథలుగా మార్చేసింది. ఆ దంపతుల జీవితకాల కల ఆదిలోనే అంతమయ్యింది. మొదటి పెళ్లిరోజే భర్తను మృత్యువు కబలించింది.

సాఫీగా సాగుతున్న జీవితం తలకిందులవ్వడంతో.. ఆ విషాదం ఆ భార్యను షాక్ లోకి నెట్టేసింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం మఠం పల్లెకు చెందిన శివ (30) తిరుపతిలో డిజైనర్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పవిత్రను నిరుడు ఏప్రిల్ 16వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో నెల క్రితం వారికి అబ్బాయి పుట్టాడు. గత గురువారం రాత్రి విధులు ముగించుకుని తిరుపతి నుంచి స్వగ్రామానికి శివ బైక్ మీద బయలుదేరాడు. తొండవాడ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు.

తీవ్రంగా గాయపడిన శివను 108లో తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పెళ్లిరోజునే మరణించావా అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనతో మఠంపల్లె విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.