భార్యే ప్రాణంగా బతికాడు. అనుకోకుండా అనారోగ్యం ఆమెను కబలించింది. భార్య చనిపోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం తనకు కూడా అవసరం లేదనుకున్నాడు. అయితే.. తాను కూడా లేకపోతే తమ పిల్లలు అనాథలు అవుతారని.. వాళ్లకి విషం ఇచ్చి.. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతానికి చెందిన కొక్కిర సత్యనారాయణ, పుష్పలత దంపతులు ముత్రాసు కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గతేడాది నవంబర్‌లో పుష్పలత అనారోగ్యంతో మృతి చెందారు.


దీంతో అప్పటి నుంచి భర్త సత్యనారాయణ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అయితే మంగళవారం కూడా మనస్తాపం చెందిన సత్యనారాయణ తన పిల్లలకు విషం ఇచ్చి, తర్వాత ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సత్యనారాయణకు పదేళ్ల కుమారుడు లోకేశ్‌, తొమ్మిదేళ్ల కూతురు తేజశ్రీ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.