కూతురిలా భావించాల్సిన మరదలిపై  ఓ బావ కన్నేశాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా.. లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు తమ్ముడు మందలించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో వెళ్లి తల్లికి తన గోడు చెప్పుకున్నాడు. అన్న చేసింది తప్పు అని చెబుతుందని ఆశపడగా.. అతనికే మద్తతు పలికింది ఆ తల్లి. దీంతో.. ఆవేశంలో కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పు కంభంపాడు కు చెందిన  తలపల రమణయ్య, భార్య రమణమ్మ దంపతులు బాతుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చెంచు రామయ్య, రెండో కొడుకు వెంకటేశ్వర్లు. కాగా.. చిన్న కొడుకుకి పెళ్లై భార్య కూడా ఉంది.

అయితే.. వీరందరికీ మద్యం అలవాటు ఉంది. మద్యం మత్తులో చెంచురామయ్య తన మరదలిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు పలుమార్లు తల్లి రమణమ్మ దృష్టికి తీసుకెళ్లాడు.

అయితే, ఆమె వెంకటేశ్వర్లును తిట్టి, పెద్దకొడుకునే సపోర్ట్‌ చేసింది. ఈ నెల 4వ తేదీన వీరంతా మండలంలోని పొట్టెంపాడు సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. ఇక్కడ కూడా అన్నదమ్ములు గొడవపడ్డారు. 

ఈక్రమంలో రమణమ్మ పెద్దకొడుక్కే సపోర్ట్‌ చేయడంతో ఆగ్రహించిన వెంకటేశ్వర్లు కత్తితో తల్లి మెడ మీద నరికాడు. దీంతో మిగిలిన వాళ్లు వెళ్లిపోయారు. నిందితుడు తల్లి శవాన్ని అక్కడి మిట్టకాలువ తూములో పడేసి పరారయ్యాడు. ఈనెల 5వ తేదీన దీనిని హత్య కేసుగా నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తులో కొడుకే హంతకుడు అని తేలడంతో అతనిని అరెస్టు చేశారు.