గుంటూరు: ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. సమీప బంధువుల చేతితో ఓ వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురయిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన చందు కృష్ణమూర్తి(55)కి సమీప బంధువులు సాయి, మురళిలతో ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణమూర్తిపై పగను పెంచుకున్న వారు అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం కృష్ణమూర్తికి స్పాట్ పెట్టారు.

తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన కృష్ణమూర్తి ఊరి శివారులో ఒంటరిగా కనిపించాడు. దీంతో ఇదే అదునుగా అతడిపై సాయి,మురళిలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కృష్ణమూర్తి తల చిద్రమై రక్తపుమడుగులో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 

ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.