కేవలం తమ కారుకు ఆటోను అడ్డుగా వుందని గొడవకు దిగిన కొందరు చివరకు ఒకరిని దారుణంగా హతమార్చిన అమానుష ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
మదనపల్లె : పులివెందులకు చెందిన వాళ్లతోనే పెట్టుకుంటారా అంటూ ముగ్గురు వ్యక్తులు వీరంగం సృష్టించారు. కేవలం తమ కారుకు ఆటో అడ్డుగా పెట్టారని గొడవకు దిగి చివరకు ఒకరిని కొట్టిచంపారు. ఈ దారుణం శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు కధనం ప్రకారం... మదనపల్లెలోని సురభి కాలనీలో అక్రమ్ వెల్డింగ్ షాప్ నడుపుకుంటున్నాడు. ఇందులో పనిచేసే ఖాదర్ వల్లి, డ్రైవర్ రెడ్డిబాషా, కార్పెంటర్ బషీర్, వాహనాలు శుభ్రంచేసే సుధాకర్ తో పాటు ఆటో డ్రైవర్ వీరనాగులు స్నేహితులు. గత ఆదివారం రాత్రి వీరంతా సరిహద్దులోని కర్ణాటకలో మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మద్యం సేవించి ఆటోలో తిరిగి మదనపల్లెకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు రాయల్పాడు సమీపంలోని ఓ బంకులో ఆగి ఆటోలో పెట్రోలు పోయించుకున్నారు. కానీ బిల్లు విషయంతో బంక్ సిబ్బందితో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు.
అయితే ఇలా బంక్ సిబ్బందితో గొడవపడుతున్న సమయంలోనే ఓ కారులో ముగ్గురు పెట్రోల్ పోయించుకోడానికి ఆ బంక్ కు వచ్చారు. అడ్డుగా వున్న ఆటోను పక్కకు తీయాలని బంక్ సిబ్బందితో గొడవపడుతున్న వారిని కోరారు. దీంతో మద్యంమత్తులో వున్న అక్రమ్ ఏదో తిట్టడంతో కారులోని వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆటోలోని వారిని అక్కడే కొట్టడానికి ప్రయత్నించగా బంక్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆటోలో వచ్చినవారు అక్కడినుండి వెళ్ళిపోయారు.
Read More పుట్టిన బిడ్డను చూసేందుకు వెళుతుండగా యాక్సిడెంట్... బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం
అయితే తాము పులివెందులకు చెందిన వారిమి... మాతోనే పెట్టుకుంటే వదిలిపెడతామా అంటూ కారులోని వారు ఆటోను వెంబడించారు. కర్ణాటక సరిహద్దులోని ఆటోను ఆపి అందులోని వారిని కిందకు దించి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ క్రమంలోనే అక్రమ్ వారినుండి తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగతావారిని కొద్దిసేపు కొట్టి వెళ్లిపోయారు.
రాత్రి పులివెందుల వారిగా చెప్పుకున్న వారినుండి తప్పించుకున్న అక్రమ్ సోమవారం కూడా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురయిన స్నేహితులు ఆటోలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే తీవ్ర గాయాలతో మదనపల్లె సమీపంలో అక్రమ్ మృతదేహం పడివుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తలపై తీవ్ర గాయాలుండటంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారులో వచ్చినవారే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితులు వైఎస్సార్ కడప జిల్లా వారిగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ కు చర్యలు తీసుకున్నారు.
