దొంగనతం చేశాడని ఓ వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పొగుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన దొర తిరుపతయ్య(55) మద్యానికి బానిసయ్యాడు. అయితే.. ఆ మద్యం కొనుగోలుకు డబ్బుల కోసం దొంగతనం చేశాడనే ఆరోపణలు అనిపై వచ్చాయి.

అదే గ్రామానికి చెందిన దొర  వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో రూ.6వేలు కనిపించకుండా పోయాయి. కాగా.. ఆ డబ్బులను తిరుపతయ్య దొంగతనం చేశాడంటూ వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే తిరుపతయ్యను.. వెంకటేశ్వర్లు, అతని కుమారుడు ఖర్జూరనాయుడు దారుణంగా కొట్టారు. 

తీవ్రగాయాలు కావడంతో.. తిరుపతయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. గ్రామస్థులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.