విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చెయ్యడంతో ఇప్పుడు అందరి చూపు మల్లాది విష్ణుపై పడింది. అసలు వివాదానికి కారణమే మల్లాది విష్ణు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

మల్లాది విష్ణుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం వల్లే వివాదం మెుదలైందని అది కాస్త ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేవరకు వెళ్లిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాధా రాజీనామాతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణుకే ఫైనల్ అయ్యింది. 

రాధా రాజీనామా అంశం, రాజీనామాకు గల కారణాలపై వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్త మల్లాది విష్ణు స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వంగవీటి రాధాకృష్ణ మంచి కోరుకుందని స్పష్టం చేశారు. 

విజయవాడ తూర్పులో రాధాకృష్ణ గెలుస్తారని సర్వేలు చెప్పడంతో అతని మంచి కోరి అక్కడ నుంచి పోటీ చెయ్యాల్సిందిగా పార్టీ ఆదేశించిందని తెలిపారు. విజయవాడ తూర్పు నుంచి రాధా పక్కాగా గెలుస్తారని ఇప్పుటికీ నమ్ముతున్నట్లు తెలిపారు. 

అందువల్లే అతనిని విజయవాడ తూర్పుకు వెళ్లమని పార్టీ హై కమాండ్ ఆదేశించిందని తనను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిందని తెలిపారు. పార్టీ అధినేత నిర్ణయాలను ఎవరైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. 

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఎలాంటి కండీషన్లు లేకుండా బేషరతుగా వచ్చానని స్పష్టం చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నిరంకుశత్వం లేదన్నారు. రాధాకృష్ణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు లేదని చెప్పలేదని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని సూచించిందన్నారు. 

అంతేకానీ సీటివ్వమని చెప్పలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ఆంక్షలు ఉంటే ఇంతమంది సీనియర్ నేతలు ఉండగలరా అని ప్రశ్నించారు. వైసీపీలో ఏదైనా సంఘటన జరిగితే తమప రాళ్లు వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆ రాళ్లు తిరిగి టీడీపీపై కూడా పడతాయన్న విషయాన్ని గమనించాలని హెచ్చరించారు.