విజయవాడ: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిసి నేత, మంత్రి  పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్యతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం వున్నట్లు అనుమానిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాజకీయంగానే కాదు మచిలీపట్నంలోని మత్స్యకార సామాజికవర్గంలోనూ కలకలం రేగింది. 

టిడిపి నాయకులు,మాజీ మంత్రి  కొల్లు రవీంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని ఉల్లింగిపాలెం వాసులు ధర్నాకు దిగారు. మోకా భాస్కరరావు  బంధువులు, మత్స్యకారులు, అభిమానులు ఈ ధర్నాలో పాల్గొని రవీంద్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొల్లు రవీంద్ర కుల ద్రోహి, కుల బహిష్కరణ చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. 

ఈ ధర్నాలో మత్స్యకారులు భారీగా పాల్గొనడంతో గ్రామంలో పోలీస్ బలగాలు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుంగా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

read more  మచిలీపట్నం వైసిపి నేత హత్య కేసు... ముగ్గురు నిందితుల అరెస్ట్

వైసీపీ నేత భాస్కరరావు హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు.  ఈ కేసులో కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మోకా భాస్కర రావు హత్య కేసులో కృష్ణా జిల్లా పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మోకా భాస్కర రావును హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీస్ విచారణ వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం.కొల్లు రవీంద్రను నేడు అదుపులోకి తీసుకుని విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. 

ఈ కేసులో ఇప్పటికే.... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రాజకీయంగా ఆధిక్యత చాటుకునేందుకే భాస్కరరావును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశం వుంది. గత నెల 29న నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు భాస్కరరావును హత్య చేయడం కలకలం రేపింది.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముగ్గురికి సంబంధం ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానికి భాస్కరరావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం.