లోక్ సభలో తుఫాన్: పవన్ కల్యాణ్ పోరాటాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ బాలశౌరి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ నిజంగానే తుఫాన్ సృష్టించారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించారని గుర్తుచేశారు. భారత దేశంలో మరే పార్టీ సాధించని ఘన విజయం జనసేన సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పొగడ్తలతో ముంచెత్తారు. లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత బుధవారం జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడారు. తొలుత, స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన పోరాటం, పోటీ చేసిన ప్రతి స్థానంలో అభ్యర్థులు ఏ విధంగా గెలిచారన్న అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడానికి ఎన్డీయే కూటమి ఏర్పాటు కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన త్యాగం గురించి సభలో ప్రస్తావించారు.
పవన్ నిజంగానే తుఫాన్.. ఎందుకంటే?
దేశంలో ఎన్డీయే కూటమి గెలుపొందిన తర్వాత తొలిసారి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్ అంటే కేవలం పవన్ కాదని.. పవన్ అంటే ఆందీ(తుఫాన్) అని ప్రశంసించారు. ఇక, ప్రధాని మోదీ మాట్లాడిన వ్యాఖ్యలను పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ బాలశౌరి.. పవన్ నిజంగానే ఏపీ రాజకీయాల్లో తుఫాన్ సృష్టించారన్నారు. ప్రత్యర్థులను మట్టి కరిపించారని కొనియాడారు. భారత దేశంలో మరే పార్టీ సాధించని ఘన విజయం తమ పార్టీ జనసేన సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 140కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన మాత్రమేనని తెలిపారు. ఇలాంటి ఘనత సాధించడం దేశ చరిత్రలోనే ప్రథమమని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.
ఇలా.. ఎంపీ బాలశౌరి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి లోక్‌సభలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. లోక్‌సభలో ఓ పార్టీ అధ్యక్షుడి గురించి ఇంత గొప్పగా చెప్పిన ఎంపీని తామెన్నడూ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్‌కి ఇష్టమైన ఎంపీగా గుర్తింపు...
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే, మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి, తన పార్లమెంట్ పరిధిలోని నాయకుల తీరు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ సమయంలో అనేకమంది సన్నిహితులు, తోటి నాయకులు అసలు జనసేన ఒక పార్టీయేనా?, ఆ పార్టీలో ఎవరైనా గెలుస్తారా? అని ఎంపీ బాలశౌరికి ఉచిత సలహాలిచ్చారు. కానీ ఇవేమి ఆయన పట్టించుకోలేదాయన. కేవలం పవన్ కల్యాణ్ ఆలోచనను, ఆయన సంకల్పాన్ని బలంగా నమ్మి ముందుకు సాగారు ఎంపీ బాలశౌరి. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి.. భారీ విజయం సాధించారు. అలాగే, పవన్ కల్యాణ్‌కు దగ్గరయ్యారు. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఎంపీగా బాలశౌరి లోక్ సభలో అడుగుపెట్టారు.