స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారుపై దుండగులు బుధవారంనాడు దాడి చేశారు. 

వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము దాడి నుంచి తప్పించుకుని తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు వెళ్లామని చెబుతున్నారు. తమకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. కారుపై ఓ వ్యక్తి పెద్ద కర్రతో దాడి చేయడం టీవీ చానెళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. 

ఇక ఇలా టీడీపీ వారు వైసీపీ గుండాల హత్యాయత్నం అని ఆరోపిస్తుండడంతో వెంటనే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి టీడీపీ నేతల కారు ఒక వికలాంగుడిని గుద్ది వచ్చిందని. అక్కడ ఆగకుండా తప్పించుకుపోతుంటే... మాచర్ల స్థానికులు వారిపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. 

అలా ఆరోపణలు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోను, ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసాడు. అంతే కాకుండా దానితోపాటు ఎన్నిసార్లు బుద్ధ వెంకన్న కారు స్పీడ్ లిమిట్లను దాటిందో కూడా ఒక ఫోటోను అదే ఖాతాలో ఉంచాడు. 

విజయవాడ నుండి బుద్దా వెంకన్న, బొండా ఉమలతో పాటు గూండాలను చంద్రబాబు నాయుడు పంపించారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పది కార్లలో విజయవాడ నుండి వచ్చిన టీడీపీ నేతలు  మాచర్ల వస్తున్న సమయంలో ఓ పిల్లాడిని టీడీపీ నేతల కారు ఢీకొట్టిందన్నారు.

ఈ విషయమై గ్రామస్తులపై టీడీపీ నేతలు దుర్భాషలాడారని ఆయన చెప్పారు.  దీంతో స్థానికులు టీడీపీ నేతల కారుపై దాడి చేశారని ఆయన వివరించారు.రైతుల ముసుగులో తనపై గతంలో దాడి చేశారని ఆయన ప్రశ్నించారు.