బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు...
తీవ్రవాయుగుండం అయినప్పటికీ తుఫానుగా మారే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది.
అమరావతి : దక్షిణ అండమాన్ సముద్ర ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం బుధవారం ఉదయం వరకు వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తర్వాత గురువారం నాడు దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని… ఈ క్రమంలో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు.
17వ తేదీ ఉదయానికి ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని ఒడిశా తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కాగా, ఇది తీవ్రవాయుగుండం అయినప్పటికీ తుఫానుగా మారే అవకాశం లేదని చెబుతోంది వాతావరణ శాఖ. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తాలోని పలుచోట్ల… తమిళనాడులో మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
ఇక బుధవారం నాటికి దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీని ప్రభావంతోనే తమిళనాడులో కూడా బుధవారం నాడు వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
బుధ, గురు వారాల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రం మీదికి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.