కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ చేసిన పనికి పోలీసులు గగుర్బాటుకు గురయ్యారు. ఓ లారీ డ్రైవర్ తన భార్యను చంపేసి, ఆమె తలను నరికి ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకుని పోలీసు స్టేషన్ కు వచ్చాడు. తలను కవర్ లోంచి తీసి పోలీసుల ముందు పెట్టాడు. 

తాను లొంగిపోవడానికి వచ్చినట్లు లారీ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. కడపజిల్లా సంబేపల్లె మండలం దేవపట్ల పంచాయతీ అసంజివాండ్లపల్లెకు చెందిన ఎన్‌.హుస్సేనయ్య, నాగూర్‌ అమ్మాజాన్‌(27) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

హుస్సేనయ్య లారీ డ్రైవర్‌ కాగా, అమ్మాజాన్‌ మర్రిపాడు ఆరోగ్య సబ్‌సెంటర్‌లో ఆశాకార్యకర్తగా పనిచేస్తోంది. అమ్మాజాన్‌ ఇతర పురుషులతో మాట్లాడడం భర్త నాగూర్‌ కు నచ్చలేదు. ఆమెను అనుమానిస్తూ వచ్చాడు. దాంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అతను భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
 
భర్త దూరం కావడంతో ఆమె మర్రిపాడుకాలనీలో నివాసం ఉంటోంది. పదిరోజుల క్రితం హుస్సేనయ్య భార్య దగ్గరకు వచ్చి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. మంగళవారం ద్విచక్రవాహనంపై ఆమెను ఎక్కించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. 

కదిరాయచెరువు వడ్డిపల్లె సమీపంలోకి రాగానే కొడవలితో భార్య తలతెగనరికాడు. వాల్మీకిపురం సీఐ ఉలసయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.