Asianet News TeluguAsianet News Telugu

లోకేష్‌వి శవ రాజకీయాలు.. ఆయన రాజకీయాల్లో ఎప్పటికీ పులకేసీనే: వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడని, మరణించిన ఏడు నెలలకు వచ్చి పార్టీ ఉనికి కోసం పరామర్శలు చేయడం సమంజసమేనా అని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో దుర్ఘటనలకు ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేకూరుస్తున్నదని అన్నారు.
 

lokesh remains as a pulakesi in politics criticises ysrcp mla gopireddy srinivas reddy
Author
Amaravati, First Published Sep 9, 2021, 5:41 PM IST

అమరావతి: చంద్రబాబు తనయుడు లోకేష్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదని, చనిపోయిన ఏడు నెలల తర్వాత పరామర్శ పేరుతో ఆయన రాష్ట్రంలో శవరాజకీయం చేస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన ఆడబిడ్ల మరణాలను కూడా రాజకీయల లబ్ది కోసం వాడుకోవడం సమంజసమేనా? అని నిలదీశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తమ ప్రభుత్వం సత్వరమే స్పందిస్తున్నదని వివరించారు.

రాష్ట్రంలో ఏ ఉన్మాది దాడులకు పాల్పడ్డా ప్రభుత్వాన్నే బూచీగా చూపడం సరికాదని, అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు జగన్ సర్కారు వేగంగా స్పందించి న్యాయం చేస్తున్నదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అలాంటి పనిచేస్తే నిలదీయాలని అన్నారు. కానీ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చేష్టలుడిగి చూసిందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావును ఉసిగొల్పి తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేయించడం, రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులవ్వడం, పెందుర్తిలో టీడీపీ నేతలే ఓ దళిత మహిళను వివస్త్రను చేశారని అని ఉదాహరణలతో విమర్శలు చేశారు. 

నర్సరావుపేటలో ఏడు నిలల క్రితం హత్యగావించబడిన అనూష కేసులు నాలుగు గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేశామని, వారంలో చార్జిషీటు ఫైల్ అవ్వగా, బాధితురాలి కుటుంబానికి రెండు రోజుల్లోనే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని వివరించారు. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ హామీనిచ్చామన్నారు. టీడీపీ హయాంలో లెక్కలేనన్ని దుర్ఘటనలు జరిగాయని, వాళ్లెప్పుడైనా ఇలా చేశారా? అని ప్రశ్నించారు. హిందు సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వారం లేదా పదిరోజుల్లో పరామర్శిస్తారని, కానీ, ఆయన ఏడునెలల తర్వాత పరామర్శకు రావడం కేవలం రాజకీయ లబ్ది కోసమేనని అన్నారు. మందిలో తిరిగితే బాగుపడుతాడని ఎవరో టీవీలో చెబితే అదే మాటను పట్టుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి రెండు మూడు గంటలు హడావుడి చేసి వెనక్కి వెళితే నాయకుడు అవుతాడా? చంద్రబాబు మెరుపు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను విమర్శిస్తే బాహుబాలి అవుతాడని అనుకుంటున్నారేమో అది కలే అని తెలిపారు. కులాలను రెచ్చగొట్టే కుట్ర బుద్ధితో లోకేష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. సోనియా గాంధీని  ఎదురించి పార్టీ పెట్టి సీఎం అయిన జగనే ఎప్పటికీ బాహుబలి అని, లోకేష్ ఎప్పటికీ పులకేసీ నెంబర్ వన్ అని అన్నారు.

‘దిశ’ ఎక్కడుంది అని ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో సుమారు 47 లక్షల మంది మహిళలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, 1645 కేసులు ఈ చట్టం స్ఫూర్తితో నమోదయ్యాయని తెలిపారు. అవసరమైతే మహిళలను ఎడ్యుకేట్ చేసి, చట్టాన్ని ఉపయోగించేలా ప్రచారం చేయాలని, ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పనులు చేస్తే స్వాగతిస్తామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios