వైసీపీ నేతలది శాడిజమంటూ మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.సాక్షి పేపర్ లో వచ్చిన ఓ కథనాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన నారా లోకేష్...వైసీపీ నేతల శాడిజమంతా సాక్షి  రాతల్లో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అని అవుట్‌ హౌస్‌ ఫొటో పెట్టి సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై లోకేశ్‌ స్పందించారు. ‘‘అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఒక సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అవుట్‌ హౌస్‌లో ఉంటారా? అయినా ఆయన నివాసానికి, అవుట్‌ హౌస్‌కి ఎంత దూరం ఉందో చూడండి’’ అంటూ సంబంధిత చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘ఆయన ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలను ఉంచారు. వరద ఉద్ధృతికి బయటకు కొట్టుకొచ్చిన ఈ పడవలే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనా వ్యవహారాల్లో ఎందుకు చూపించరు. జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి? డ్రోన్‌తో ఉన్న బాక్సులో ఏముంది? వాళ్లు మీ పేరెందుకు చెప్పారు?’’ అంటూ వైసీపీ నేతలను లోకేష్ ప్రశ్నించారు.