అమరావతి: పోలవరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి నారా లోకేష్. పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్నే కేంద్రం ఆమోదించిందని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలకే కేంద్రం ఆమోదం తెలిపిందని అదీ తమ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. 

ఆనాటి తమ అంచనాలను కేంద్రం ఆమోదం తెలిపితే అదేదో తమ గొప్పతనంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బా కొట్టుకుంటుందని ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజల కోసం అహర్నిశలు చంద్రబాబు పడ్డ కష్టానికి ఫలితమే పోలవరం ప్రాజెక్ట్ అని వివరించారు. 

ఇప్పటికైనా బీజేపీ, వైసీపీ నాయకులు తెలుగుదేశం మీద బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన 30శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని మాజీమంత్రి నారా లోకేష్ హితవు పలికారు.