Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకోవడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు.
Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. చివరి నిమిషంలో ఆయన అనుమతులను ఎయిపోర్టు అధికారులు నిరాకరించారు. పవన్ కల్యాణ్ విజయవాడ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఏపీ పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు పయనమయ్యారు. అయితే.. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద ఆయన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా జనసైనికులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే.. వీసా, పాస్‌పోర్టు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ అక్కడే రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు.
ఈ పరిణామాలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకోవడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఏ కారణం లేకుండా.. పోలీసులే అల్లరి మూకల మాదిరిగా రోడ్డుపై అడ్డంపడి పవన్ కళ్యాణ్ ని కదలనివ్వకుండా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలని అక్రమంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉన్నాయని విమర్శించారు.
