సరదాగా జరిగిన ఆట ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ పాఠశాలలో ఈ నెల 14న ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఓ విద్యార్ధి మరో విద్యార్ధినిని ఆట పట్టించేందుకు గాను టాయ్‌లెట్‌లో పెట్టి గొళ్లెం పెట్టాడు.

అయితే బడి గంట కొట్టడంతో గొళ్లెం సంగతి మరచిపోయిన ఆ విద్యార్ధి తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. బాత్‌రూమ్‌లోనే ఉన్న విద్యార్ధి భయంతో కేకలు వేస్తూ తలుపులు బాదినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.

కాసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఓ మహిళ చిన్నారి అరుపులు విని బాత్‌రూమ్‌ తలుపులు తీసి తరగతి గదిలో వదిలిపెట్టింది. అయితే ఎక్కువ సేపు చీకటిలో ఉండటంతో పాటు గుక్కపట్టి ఏడవటంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.

అయితే ఆ తర్వాతి రోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సైతం చిన్నారి హాజరయ్యాడు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 17న ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ఈ నెల 18న మరణించాడు. దీంతో బాబు తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళనకు దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.