కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల నుంచి మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లాక్ డౌన్‌ నిబందనలు సడలించిన నేపధ్యంలో ఈ నెల 8 నుంచి  టూరిజం ప్రాంతాల్లోని హోటల్లు,‌రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

9 కమాండ్ కంట్రోల్‌రూం లను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా‌ వచ్చే వారం రోజుల్లో ప్రారంభిస్తామని అవంతి చెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద కోస్తా తీరం.. అందమైన నదులు, పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నందున  అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు.

Also Read:ఏపీలో కరోనా విజృంభణ: 3377కు చేరుకున్న పాజిటివ్ కేసులు, 71 మరణాలు

పుణ్యక్షేత్రాలలో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటామని.. పర్యాటకులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కరోనా నివారణ చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించామని అవంతి వెల్లడించారు. పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Also Read:నిన్న సచివాలయం, నేడు విద్యుత్ సౌధ... ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం

అరకు, గండికోట, హర్స్‌లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపడుతున్నామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కారణంగా నెలకు రూ.10 కోట్ల ఆదాయం కోల్పోయామన్న ఆయన బోట్ ఆపరేటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సోమవారం నుంచి హోటల్స్ బుకింగ్ ఆన్ లైన్ లో చేసుకోవచ్చని, రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్‌తో కలిసి ఆయన హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు.