ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుండి రాజకీయాలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైసీపీలతోపాటుగా బీజేపీ వార్తల్లో నిలిచింది. ఆయన ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

నిన్న రాజధాని వికేంద్రీకరణ బదులు పాలన వికేంద్రీకరణ జరగాలని.. ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని సుజనా అన్నారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5, 6కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్ వద్దకు తీసుకెళ్లిందని ఆయన గుర్తుచేశారు. 

గవర్నర్ న్యాయ సమీక్షకు పంపకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోరని సుజనా చెప్పారు. అసలు రాజధాని మార్పు ఫైల్ ఎక్కడ ఉందో అర్ధం కాని పరిస్థితన్నారు. కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకుంటుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

దీనిపై సోము వీర్రాజు కౌంటర్ ఇస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీకి విరుద్ధమని బిజెపి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రబుత్వం పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారని వివరించింది.

సుజనా వ్యాఖ్యను ఖండించగానే ఏకంగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర తెలిపింది. సోము వీర్రాజు సుజనా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. 

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో అడుగులుఎటుగా వేస్తుందని విషయాన్నీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు అనుమతులు ఇచ్చారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో గవర్నర్ వ్యవస్థల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో కోర్టు తీర్పులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 

కేంద్రం మూడు రాజధానుల విషయంలో జోక్యం చేసుకోలేదు అని పదే పదే జీవీఎల్ వంటివారు చెబుతూనే ఉన్నారు. అవును, కేంద్రం జోక్యం చేసుకోలేదు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధం. కేంద్ర ప్రభుత్వాలు (కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ) ఈ స్ఫూర్తికి ఏమాత్రం విలువనిచ్ఛయో రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలనలను, పడగొట్టిన ప్రభుత్వాలను చూస్తే మనకు అర్థమవుతుంది.

కేంద్రం కావాలనుకుంటే జగన్ కి ఒక ఫోన్ చేయడం ద్వారా ఆపొచ్చు. కానీ వారు ఆపని చేయలేదు. వారు జగన్ కి వంత పాడారు. దీంట్లో జగన్ కి మద్దతిచ్చారు అనే కోణం కన్నా, టీడీపీని బలహీన పర్చడానికి వేసిన ఎత్తుగడగానే అర్థం చేసుకోవచ్చు. 

ఎన్నికల తరువాత టీడీపీలో ఊపిరులు ఊదిన అంశం టీడీపీ. కానీ ఇప్పుడు అదే అమరావతిని గనుక పక్కనపెడితే టీడీపీకి పోరాడడానికి రాజకీయంగా అంశం లేకుండా పోతుంది. టీడీపీ మరింతగా బలహీన పడుతుంది. 

సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటినుండి వైసీపీవారు భావిస్తుంది ఇదే. అనుకున్నట్టే ఆయన పదవిని చేపట్టగానే చంద్రబాబుకి బలమైన షాక్ తగిలింది. టీడీపీని బలహీన పరచడంద్వారా ప్రతిపక్షంగా తామే ఎదగాలని భావిస్తుంది బీజేపీ. 

ఇప్పటికైనా జగన్ బ్యాటింగ్ ని తట్టుకోలేని ప్రతిపక్షం బీజేపీ గూటికి చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. కానీ పరిస్థితులను చూస్తుంటే వారు బీజేపీ కన్నా వైసీపీ యే నయం అనుకుంటున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న వల్లభనేని వంశి అయినా, నిన్న సిద్ద రాఘవరావు అయినా, రేపు గంటా అయినా, అందరూ వైసీపీ వైపు చూస్తున్నారు కానీ బీజేపీలో తమ రాజకీయ భవిష్యత్తును ఊహించుకోలేకపోతున్నారు.