విశాఖపట్నం: గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యం దిగొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో సంస్థ జీఎం మొక్కబడిగా ఓ ప్రకటన చేశారు. అయితే, తాము తీసుకోబోయే చర్యలను తెలియజేస్తూ ఎల్జీ పాలీమర్స్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పింది.

బాధితుల వైద్యావసరాల కోసం ఓ మెడికల్ కమిటీని వేయనున్నట్లు తెలిపింది. బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. సాంకేతిక నిపుణులు, ప్రభుత్వం కలిసి ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపింది. ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తామని కూడా చెప్పింది.

ఇదిలావుంటే, విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలతో పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. కొందరు లోనికి దూసుకెళ్లారు. పరిశ్రమను పరిశీలించడానికి వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో గౌతమ్ సవాంగ్ పరిశ్రమ లోపలే ఉండిపోయారు. 

ఎల్‌జీ పాలీమ‌ర్స్ వ‌ద్ద ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామస్తు ఆందోళన దిగారు. రోడ్డుపై పెద్ద సంఖ్య‌లో ధ‌ర్నాకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పలువురిని అరెస్ట్

 చేశారు. కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్తై త‌మ ప్రాణాల‌తో చ‌ల‌గాల‌మాడుతున్నార‌ని గ్రామస్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

పెను విషాధానికి కార‌ణ‌మైన ప‌రిశ్ర‌మ‌ను వెంట‌నే అక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని డిమాడ్ చేస్తూ ప్ర‌భుత్వానికి వ్య‌తికేకంగా నినాదాలు చేశారు. తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయ‌డంపై గ్రామస్థులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.