విజయవాడ: ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనపై తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు అనుమానం ఉందని అనడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పేపుర్ పులిగా ఆయన అభివర్ణించారు. 

1998లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగిందని, అప్పుడు ఆ కంపెనీని ఎందుకు మూయించలేదని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నా చచ్చినట్లు లెక్క అని ఆయన అన్నారు. ఉదయం ఓ మాట, మధ్యాహ్నం మరో మాట, సాయంత్రం మరో మాట మాట్లాడుతారని ఆయన అన్నారు. సిగ్గూశరం లెకుండా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. 

హిందూస్తాన్ పాలిమర్స్ ను ఎల్జీ పాలీమర్స్ గా మార్చింది చంద్రబాబేనని ఆయన అన్నారు. 2017లో ఆ పరిశ్రమ విస్తరణకు కూడా చంద్రబాబే అనుమతించారని ఆయన అన్నారు. ఎల్జీ పాలిమర్స్ సంఘటనపై చంద్రబాబు ముగ్గురు దద్దమ్మలతో కమిటీ వేశారని, అది జోకర్ల కమిటీ అని ఆయన అన్నారు. సిఎం జగన్ వేసిన కమిటీ పనికి రాదని చంద్రబాబు అనడంపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

మృతుల కుటుంబాలకు కోటి రూపాయలేసి నష్టపరిహారం చెల్లించడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గోదావరి పుష్కరాల షూటింగులో 30 మంది మరణిస్తే చంద్రబాబు మూడు లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ఇచ్చారని, అది వారిని బతికిచిందా అని ఆయన అన్నారు. చంద్రబాబు సన్నాసిగా ఆయన అభివర్ణించారు.