అనంతపురం: రాబోయే ఎన్నికల్లో జనసేనతోనే తాము ఎన్నికలకు వెళ్తామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అనంతపురం జిల్లాలో కరువు బారినపడి తీవ్ర ఇబ్బందులుపడుతున్న రైతులను ఆదుకోవాలంటూ వామపక్ష పార్టీలు, జనసేన పార్టీలు కలిసి కవాతు నిర్వహించాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎరుపు జెండాలు పట్టుకుని భారీ ప్రదర్శన చేపట్టాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులతో పాటు జనసేన ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కరువు కారణంగా ఆత్మహత్యలు, వలసలు పెరిగిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఓ వైపు సీఎం చంద్రబాబు అబద్ధాలతో కాలం గడుపుతుంటే.. మరోవైపు ప్రధాని మోదీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 

అనంతపురం జిల్లాలో కరువుపై సీఎం ఇప్పటికైనా స్పందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీలు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము, జనసేన కలిసి ఉంటామని స్పష్టం చేశారు.