Asianet News TeluguAsianet News Telugu

లీడ్ క్యాప్ భూముల వ్యవహారం... టిడిపి నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు

ఇళ్ల స్థలాల పేరుతో విలువైన లీడ్స్ క్యాప్ భూములను ఆక్రమించుకోవాలని అధికార వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది. 

leeds cap lands issue...TDP Committee were stopped by police
Author
Darshi, First Published May 26, 2020, 12:13 PM IST

గుంటూరు: ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లీడ్ క్యాప్ సంస్థకు చెందిన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోందని టిడిపి ఆరోపిస్తోంది.  లీడ్ క్యాప్ భూముల వ్యవహారంపై నిజనిర్ధారణ చేసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎరిక్సన్ బాబు, పిల్లి మాణిక్యాల రావు, ఎం.ఎస్.రాజులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయడం జరిగింది.

ఈ క్రమంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన టిడిపి నిజనిర్దారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. దుర్గి మండల పరిధిలోని లీడ్ క్యాప్ భూములను పరిశీంచాలని  కమిటీ సభ్యులు ప్రయత్నించారు. మాజీ మంత్రి జవహర్ నేతృత్వంలో దుర్గి బయలుదేరిన కమిటీ కమిటీ సభ్యులను సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  

 ''2002లో చంద్రబాబు నాయుడు మీడియం, మెగా లెథర్ పార్కులు ఏర్పాటు చేసి చర్మకారులందరికీ ఉపాధి కల్పించారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి లిడ్ క్యాప్ ను మూసేస్తే.. చంద్రబాబు నాయుడు మళ్లీ తెరిపించారు. చెప్పులు కుట్టుకునే చర్మకారులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారు'' అని తెలుగుదేశం పార్టీ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు అన్నారు.  

''సెంట్రల్ లెథర్ పార్కుతో ప్రత్యేకంగా చర్చలు జరిపి చెప్పులు, షూ, బెల్టులు తయారు చేసేవారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూసివేయించారు. ఇప్పుడు ఆయా సంస్థల భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఈ కమిటీ సమగ్ర వివరాలు సేకరించడం జరుగుతుంది'' అని దారపనేని వెల్లడించారు. 

చంద్రబాబు హయాంలో లిడ్‌ క్యాప్‌ లెదర్‌ ఇండస్ట్రీకి 751.91 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే  విలువైన ఈ భూములను ఇవాళ జగన్‌ ప్రభుత్వం  అన్యాక్రాంతం చేయాలనే ప్రయత్నం చేస్తుందని టిడిపి ఆరోపిస్తోంది. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూ కుంభకోణాలకు జగన్‌ ప్రభుత్వం తెరలేపిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios