Asianet News TeluguAsianet News Telugu

వందేళ్ల తర్వాత... పుట్టినరోజున బృహత్తర పథకానికి శ్రీకారంచుట్టిన సీఎం జగన్

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు సీఎం శ్రీకారం చుట్టారు సీఎం జగన్.
 

Land resurvey begins across Andhra Pradesh
Author
Amaravathi, First Published Dec 21, 2020, 2:15 PM IST

విజయవాడ: ''వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష'' పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న భూముల రీసర్వేను తన పుట్టినరోజున లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు సీఎం శ్రీకారం చుట్టారు.

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... దొంగ రికార్డులు సృష్టించి అమాయక రైతుల నుండి భూములు కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా భూసర్వే పకడ్బందీగా చేపడుతున్నామని అన్నారు. 16 వేల మంది సర్వేయర్లతో భూ రీసర్వే చేపడుతున్నామని... ఇందులోభాగంగా ముందుగానే సర్వేయర్లందరికీ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీతో  శిక్షణ ఇప్పించామన్నారు.  

Land resurvey begins across Andhra Pradesh

ప్రతిపక్ష నాయకుడిగా చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో అనేకమంది భూసమస్యలతో తన వద్దకు వచ్చేవారని... వారి కష్టాలు విన్నాక దీనికి శాశ్వత పరిష్కారం వుండాలని భావించినట్లు తెలిపారు. అందుకోసమే దాదాపు వందేళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని... ప్రతి ఒక్కరి భూములకు వైసిపి ప్రభుత్వం రక్షణ ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 

 ఎన్ని దశలు? ఎంత వ్యయం?

సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో సమగ్ర భూముల సర్వే, ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం’ అమలు చేస్తున్నారు. ఇందు కోసం 4500 బృందాలు పని చేయనున్నాయి. తొలి దశ సర్వే ఈనెల నుంచి వచ్చే ఏడాది (2021) జూలై వరకు, రెండో దశ సర్వే 2021 అక్టోబరు నుంచి 2022 ఏప్రిల్‌ వరకు, చివరిదైన మూడో దశ సర్వే జూలై 2022 నుంచి 2023 జనవరి వరకు కొనసాగనుంది. 

Land resurvey begins across Andhra Pradesh

ఎన్ని గ్రామాలు? ఎంత భూమి?

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల గ్రామాల్లోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో ఈ సర్వే నిర్వహిస్తారు. 

సర్వే విధానం:

తొలుత గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు వివరిస్తారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్, కార్స్, రోవర్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందిస్తారు. ప్రతి యజమానికి నోటీసు ద్వారా ఆ సమాచారం అందజేస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, గ్రామ సచివాలయంలోని గ్రామ సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకుంటే, అవి సత్వరం పరిష్కారం అయ్యేలా ప్రతి మండలంలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.     సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.

Land resurvey begins across Andhra Pradesh

సర్వే ముఖ్యాంశాలు:

ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం

ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)

రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌

భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు

అభ్యంతరాల సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు

ఉచిత వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దు రాళ్లు

గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు

సర్వే ప్రయోజనాలు:

దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య. భూ యజమానులకు తమ భూములపై వేరెవరూ సవాల్‌ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు. తద్వారా భూవివాదాలకు స్వస్తి. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డుల స్వచ్ఛీకరణ. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు ఉచితంగా సర్వే. ఆ తర్వాత ఉచితంగా వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దురాళ్లు ఏర్పాటు. దీని వల్ల సరిహద్దు వివాదాలకు స్వస్తి.

కొన్ని చోట్ల కొందరికి సంబంధించిన రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే, వారు అనుభవిస్తున్న భూమి మరో చోట ఉండడం. ఇలాంటివన్నీ సరి చేయబడతాయి. దీంతో భూమి సబ్‌ డివిజన్‌ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇకపై ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం అవుతాయి. అంతే కాకుండా ఆయా ప్రక్రియలు సులభతరం అవుతాయి. రిజిస్ట్రేషన్‌ కూడా గ్రామంలోనే చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios