పరిష్కారం కానీ సర్వర్ల సమస్య .. ఏపీలో రేపటి నుంచి మాన్యువల్‌గా లాండ్ రిజిస్ట్రేషన్లు
ఏపీలో సర్వర్లు మొరాయించడంతో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో రోజూ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతూ వుండటంతో .. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి సామాన్యులు తమ భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సర్వర్లు మొరాయించడంతో నిన్న ఉదయం నుంచి నేటి వరకు భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.