చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా టీచర్ ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, భర్తనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని టీచర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

మదనపల్లికి చెందిన చంద్రజ్యోతికి రెండు నెలల క్రితం శ్రీకాళహిస్తికి చెందిన శరత్ తో వివాహమైంది. చంద్రజ్యోతి ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుండగా, శరత్ కుప్పంలోని సహకార బ్యాంకులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి కుటుంబాల పెద్దలు సర్దిచెబుతూ వస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా ఇరువురు గొడవ పడ్డారు. గొడవ తర్వాత శరత్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత మదనపల్లిలోని చంద్రజ్యోతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అమ్మాయి ఏమైందో చూసుకోండని చెప్పాడు.

తల్లిదండ్రులు కుప్పం వచ్చి చూసేసరికి ఇంట్లో చంద్రజ్యోతి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.