విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. జగన్‌పై దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేవీపీ డిమాండ్ చేశారు.
 
 వైఎస్ జగన్ శుక్రవారం కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో పాదయాత్రకు విరామం చెప్పి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ ను వెయిటర్ శ్రీనివాస్ టీ ఇస్తూ పలకరించాడు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయా సార్ అంటూ పలకరించాడు. 

సెల్ఫీ దిగుతాను సార్ అంటూ చెప్పి తాను వెంట తెచ్చుకున్న కత్తితో జగన్ భుజంపై దాడి చేశాడు. ఎయిర్ పోర్ట్ లో ప్రథమ చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలు దేరారు. నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.