విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు సతీసమేతంగా హాజరయ్యారు. 

వైయస్ జగన్ తాను చేయబోతున్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైయస్ జగన్ స్వయంగా కేవీపీకి ఫోన్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఒకానొక దశలో ఆయన జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా అన్న సందేహం నెలకొంది. 

అయితే కుటుంబ సభ్యుడి హోదాలో కేవీపీ రామచంద్రరావు ఆయన భార్య సునీతతో కలిసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. వీఐపీ గ్యాలరీలో కేవీపీ ఆశీన్నులయ్యారు. కేవీపీ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనను కలిసి ముచ్చటిస్తున్నారు.