కర్నూల్: సినీ హీరో మహేష్ బాబుకు జగనన్న విద్యా దీవెన పథకంలో అర్హత కల్పించారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న కార్డు ఈ మేరకు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

 కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైష్ణవి డిగ్రీ కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతున్న  ఈడిగ లోకేష్ గౌడ్  జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు.

మరో వైపు ఎమ్మిగనూరులోని సిద్దార్ద డిగ్రీ కాలేజీకి చెందిన లక్ష్మి ఈ స్కీమ్ కింద ధరఖాస్తు చేసుకొంది. లోకేష్ గౌడ్ కు కార్డు అందింది. లక్ష్మికి ఇంకా కార్డు అందలేదు.

కానీ లక్ష్మి కార్డుపై లక్ష్మి ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్ బాబు ఫోటో ఉంది.ఈ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ విషయం లక్ష్మి తల్లిదండ్రులకు తెలిసింది. లక్ష్మి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  అసలు లక్ష్మి ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్ బాబు ఫోటో ఎందుకు వచ్చిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

అసలు పొరపాటు ఎక్కడ జరిగిందనే విషయమై విచారణ ప్రారంభించారు. గతంలో కూడ ఇదే తరహలో ఓటరు లిస్టుల్లో సినీహీరోల పేర్లు, ఫోటోలు కూడ వచ్చిన ఘటనలు వచ్చాయి.