Asianet News TeluguAsianet News Telugu

కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్రవేశారు. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాతి నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. వరుసగా 7 సార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. 

Kuppam Assembly elections result 2024 akp
Author
First Published Jun 4, 2024, 6:49 AM IST

కుప్పం .. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్రవేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కుప్పంతో చంద్రబాబు అనుబంధం విడదీయరానిది. 1983లో తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన చంద్రబాబు .. టీడీపీ అభ్యర్ధి చేతుల్లో ఓటమి పాలయ్యారు.

అయితే 1989 నాటికి తెలుగుదేశంలో చేరిన ఆయన నాటి ఎన్నికల్లో తన మకాంను చంద్రగిరి నుంచి కుప్పానికి మార్చారు. నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గాన్ని తనకు కేరాఫ్‌గా మార్చుకున్నారు. వరుస గెలుపులతో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు. నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు తప్ప మరెవ్వరికి ఓటు వేయడం లేదు. పెద్దగా ప్రచారం చేయకపోయినా కుటుంబ సభ్యులే ఆయన తరపున నామినేషన్ వేసినా చంద్రబాబును కుప్పం ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు. 

కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. చంద్రబాబు అడ్డా :

కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో వుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడేవాళ్లు నియోజకవర్గంలో ఎక్కువ.  కమ్మ , రెడ్డి, శెట్టిబలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. 1955లో ఏర్పడిన కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,306 మంది. వీరిలో పురుషులు 1,11,428 మంది. మహిళలు 1,11,860 మంది. కుప్పం సెగ్మెంట్ పరిధిలో కుప్పం మున్సిపాలిటీ, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలున్నాయి. 

కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. 1983లో మొదలైన టీడీపీ శకం .. నేటి వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. 1983, 1985లలో టీడీపీ తరపున రంగస్వామి నాయుడు వరుస విజయాలు సాధించారు. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాతి నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. వరుసగా 7 సార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. 

కుప్పం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. జగన్ స్పెషల్ ఫోకస్ :

2019 ఎన్నికల నుంచి చంద్రబాబు కోటకు బీటలు వారడం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. నాటి ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో టీడీపీ మద్ధతుదారులు ఓటమి పాలవ్వడంతో తెలుగుదేశం హైకమాండ్ ఉలిక్కిపడింది. దీంతో చంద్రబాబు నాయుడు జాగ్రత్తపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గానికి తరచుగా వెళ్తున్నారు. మొన్నటికి మొన్న ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. వాస్తవానికి కుప్పం నియోజకవర్గంపై గతంలో చంద్రబాబుకు ప్రత్యర్ధులుగా వున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఫోకస్ చేయలేదు. నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తమే వచ్చి, పని చూసుకుని వెళ్లిపోయేవారు. 

గతంలో చంద్రబాబుపై పోటీ చేసి ఓటమిపాలైన కేఎస్ భరత్‌ను జగన్ అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీగా, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేస్తున్నారు. 

కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ :

చంద్రబాబు నాయుడు సైతం కుప్పం విషయంలో అలర్ట్ అయ్యారు. జగన్, పెద్దిరెడ్డిలకు చెక్ పెట్టాలని పావులు కదిపారు. లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్ పెట్టిన ఆయన .. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు వ్యూహాలను ఆయన పక్కాగా అమలు చేసారు. ఎక్కడ పార్టీ వీక్‌గా వుందో అక్కడ సెట్ చేయడంతో పాటు ‘‘ లక్షే లక్ష్యం ’’ అన్న నినాదంతో ప్రచారం చేపట్టారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios